: కొత్త ఏడాదిలోనూ మోదీ దూకుడు... 2016లో ఆరు దేశాలను చుట్టేయనున్న ప్రధాని


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏమాత్రం ప్రభావితం చేయలేదనే చెప్పాలి. నిత్యం విదేశాల్లో పర్యటిస్తున్న మోదీ, దేశంలో జరుగుతున్న వ్యవహారాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని రాహుల్ గాంధీ విమర్శించిన సంగతి తెలిసిందే. ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫారిన్ పాలసీలో తనదైన ముద్ర వేసిన నరేంద్ర ఏడాదిన్నరలో చాలా దేశాల్లోనే పర్యటించారు. గత నెలలో అందరికీ షాకిస్తూ గంటల ముందు ఖరారైన పాకిస్థాన్ పర్యటనకూ ఆయన వెళ్లివచ్చారు. ఇక 2016లోనూ ఇదే తరహా ఫారిన్ పాలసీతోనే ఆయన ముందుకు వెళ్లనున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా ఖరారైన షెడ్యూల్ ప్రకారం మోదీ ఆరు దేశాల్లో పర్యటించనున్నారు. ఇక మొన్నటి లాహోర్ పర్యటన తరహాలో అప్పటికప్పుడు నిర్ణయమయ్యే విదేశీ పర్యటనలు వీటికి అదనం. ఇప్పటిదాకా ఖరారైన మోదీ విదేశీ పర్యటనల షెడ్యూల్ పై ఓ లుక్కేద్దాం. ఈ ఏడాది తొలి విదేశీ పర్యటనలో భాగంగా మోదీ అమెరికా వెళ్లనున్నారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 1 దాకా... అంటే రెండు రోజుల పాటు ఆయన అమెరికాలో పర్యటిస్తారు. అణు భద్రతపై జరిగే సదస్సులో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లనున్న మోదీ... అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పాటు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తోనూ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఇక రెండో పర్యటన కింద జూలైలో లాటిన్ అమెరికా దేశం వెనిజులాకు వెళ్లనున్నారు. ఇండో-జపాన్ సదస్సుకు సంబంధించి ఇరు దేశాల ప్రధానుల భేటీకి ఈ ఏడాది జపాన్ ఆతిథ్యమివ్వాల్సి ఉంది. ఇందుకోసం ప్రధాని ఈ ఏడాదిలో జపాన్ లో పర్యటించనున్నారు. మొన్న షాకిచ్చినట్లుగా కాకుండా ఈ ఏడాది మోదీ పాకిస్థాన్ పర్యటనకు ముందుగానే చెప్పి వెళతారు. సెప్టెంబర్- నవంబర్ మాసాల్లో జరగనున్నట్లుగా భావిస్తున్న సార్క్ సదస్సు పాక్ లో జరగనుంది. ఈ సదస్సుకు మోదీ హాజరుకానున్నారు. నవంబర్ ఒక్క నెలలోనే మోదీ రెండు, మూడు దేశాల్లో పర్యటించే అవకాశాలున్నాయి. అసియాన్ సదస్సు కోసం ఆయన నవంబర్ లో లావోస్ లో పర్యటించనున్నారు. ఇక జీ-20 సదస్సుకు హాజరయ్యే నిమిత్తం ఆయన అదే నెలలో చైనాలోనూ పర్యటించాల్సి ఉంది.

  • Loading...

More Telugu News