: కేజ్రీ అబద్ధాల యంత్రం... లక్ష్మణ రేఖ దాటేస్తున్నారు: బీజేపీ ఘాటు వ్యాఖ్యలు
చీపురు పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కొద్దిసేపటి క్రితం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ సీఎంఓలో సీబీఐ సోదాలు, డీడీసీఏపై విచారణకు ఢిల్లీ సర్కారు ఉత్తర్వుల నేపథ్యంలో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య ఆసక్తికర యుద్ధానికి తెర లేచింది. నిన్నటిదాకా కాస్తంత సంయమనంగానే విమర్శలు, ప్రతి విమర్శలు గుప్పించుకున్న బీజేపీ, కేజ్రీ తాజాగా ఘాటు వ్యాఖ్యలకు శ్రీకారం చుట్టారు. ఎవరెన్ని కుట్రలు చేసినా డీడీసీఏపై విచారణకు బ్రేకులు పడబోవని కేజ్రీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీనే సిబీఐ అధికారులను రంగంలోకి దించారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కొద్దిసేపటి క్రితం బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ ఢిల్లీ సీఎంపై ఓ స్థాయిలో విరుచుకుపడ్డారు. కేజ్రీని అబద్ధాల యంత్రంగా అభివర్ణించిన ఆయన, ఢిల్లీ సీఎం లక్ష్మణ రేఖ దాటుతున్నారని హెచ్చరించారు. ప్రధాని స్థానంలో ఉన్న నేతపై అసభ్య పదజాలంతో కూడిన విమర్శలతో యావత్తు దేశ ప్రజలను కూడా అవమానపరుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.