: నోయిడా శాపం... అఖిలేశ్ యాదవ్ ను బెంబేలెత్తిస్తోంది!


ఈ ఏడాది చివరి రోజు డిసెంబర్ 31న ప్రధాని నరేంద్ర మోదీ గ్రేటర్ నోయిడాలో ఓ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమే నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రధాని వస్తే, సదరు రాష్ట్ర సీఎం కూడా తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంది. ప్రొటోకాల్ నిబంధనల మేరకు ఇది తప్పనిసరి కూడా. అయితే తన సొంత రాష్ట్రంలో తన సొంత ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సదరు కార్యక్రమానికి ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ వస్తున్నా, యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ మాత్రం హాజరుకావడం లేదట. అదేంటీ, అంటే ‘నోయిడా శాపం’ అఖిలేశ్ ను బెంబేలెత్తిస్తోంది. ఇక్కడ జరిగిన కార్యక్రమాల్లో ఇటు పాల్గొన్నారో, లేదో... అటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రుల పదవులు ఊడిపోయాయట. 1988 నుంచి వరుసగా చోటుచేసుకుంటూ వచ్చిన ఘటనలను నెమరు వేసుకుంటున్న అఖిలేశ్ సదరు కార్యక్రమానికి తన తరఫున రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కైలాశ్ యాదవ్ ను ఆయన పంపిస్తున్నారు. అసలు అఖిలేశ్ గుర్తు చేసుకుంటున్న వరుస ఘటనలు ఏంటంటే... -1988లో అక్కడి కార్యక్రమానికి హాజరైన నాటి సీఎం వీర్ బహదూర్ సింగ్ పదవి కోల్పోయారు. -1997లో నోయిడాలో పర్యటించిన వెంటనే మాయావతి కూడా సీఎం పోస్టు నుంచి దిగిపోయారు. -1989లో ఎన్డీ తివారీ, 1999లో కల్యాణ్ సింగ్ లు కూడా నోయిడాను సందర్శించిన తర్వాతే పదవి కోల్పోయారు. -ఇక అఖిలేశ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ కూడా 1995లో నోయిడాలో పర్యటించిన నెలల వ్యవధిలోనే పదవి నుంచి దిగిపోయారు. -2011లో నోయిడాలో దళిత ప్రేరణ స్థలిని ప్రారంభించిన అప్పటి సీఎం మాయావతి ఆ తర్వాత 2012లో జరిగిన ఎన్నికల్లో అఖిలేశ్ పార్టీ చేతిలోనే పరాజయం పాలయ్యారు.

  • Loading...

More Telugu News