: టీవీ చర్చలో ఒకర్నొకరు తిట్టుకున్న పాక్ మాజీ క్రికెటర్లు!
పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు రమీజ్ రాజా, మహమ్మద్ యూసుఫ్ టీవీ యాంకర్ ను బిత్తరపోయేలా చేశారు. పాకిస్థాన్, న్యూజిలాండ్ సిరీస్ సందర్భంగా వీరిద్దరూ మ్యాచ్ గురించి విశ్లేషిస్తున్నారు. పాక్ క్రికెట్ గురించి చర్చ వచ్చింది. ఇంతలో అకస్మాత్తుగా రమీజ్ రాజా మాట్లాడుతూ, ఎవరైతే గడ్డం పెంచుకుంటారో వారు అబద్ధాలకు దూరంగా ఉండాలని యూసఫ్ ను ఉద్దేశించి వ్యంగ్యంగా పేర్కొన్నాడు. దీంతో అగ్గి రాజుకుంది. వెంటనే యూసఫ్ మాట్లాడుతూ, 'సిగ్గుమాలిన పనులు చేసేవారే నీలా అర్థం లేకుండా మాట్లాడుతారు' అనేశాడు. 'నీకు క్రికెట్ ఆడే సామర్థ్యమే లేదు, మాటకారితనంతో మాయ చేస్తున్నావు...నీకు గడ్డం పెంచే అర్హత లేదు. నువ్వు పాకిస్థాన్ క్రికెట్ కు చేసిందేమీ లేదు. 57 టెస్టుల్లో కేవలం రెండు సెంచరీలు మాత్రమే చేశావు. అసలు ప్రముఖ క్రికెటర్ వి ఎలా అయ్యావో చూడాలని ఉంది, నువ్వు క్రికెటర్ వి కాదు, ఇంగ్లీష్ టీచర్ వి' అంటూ నిప్పులు చెరిగాడు యూసఫ్. దానికి సమాధానంగా రమీజ్ రాజా మాట్లాడుతూ, 'నువ్వేం మాట్లాడినా ఫర్వాలేదు. పాకిస్థాన్ క్రికెట్ లో చీడ పురుగు మాదిరిగా తయారయ్యావు' అంటూ మరోసారి చురక అంటించాడు. దీనికి సమాధానంగా 'అవును, నాకు క్రికెట్ సర్వస్వం, అది తప్ప ఇంకోటి తెలీదు, నీకు అదే తెలీదు' అంటూ మండిపడ్డాడు. దీంతో యాంకర్ ఎలాగోలా సర్ది చెప్పి విశ్లేషణ ముగించాడు. ఇది అంతర్జాతీయ క్రికెట్ లో దుమారం రేపుతోంది.