: మనల్ని చూసి కరవు భయపడాలి: సీఎం చంద్రబాబు


మనల్ని చూసి కరవు భయపడాలి తప్పా, కరవును చూసి మనం భయపడకూడదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురంలోని శ్రీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన ‘నీరు - ప్రగతి’ రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సులో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కూడా పాల్గొన్నారు. తొలుత నీరు-ప్రగతి ప్రదర్శనశాలను వారు పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ, రాయలసీమను రతనాల సీమగా తీర్చిదిద్దే బాధ్యత తమ పార్టీ తీసుకుంటుందన్నారు. కరవును చూసి మనం భయపడని విధంగా ఉండేలా ప్రభుత్వ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. 'పంట సంజీవని' పేరుతో జిల్లాలో లక్ష ఫాం పాండ్స్ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. నీటి కొరతను అధిగమించేందుకు నదులను అనుసంధానిద్దామని, చెక్ డ్యాంలు, పొలాల్లో కుంటలు నిర్మించుకోవడం ద్వారా భూమినే జలాశయంగా మార్చుకుందామని బాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News