: గుర్గావ్ విద్యార్థిని కిడ్నాప్ కథ సుఖాంతం!...పరిచయస్తులే ఈ పని చేశారు: పోలీసు కమిషనర్
గుర్గావ్ లో సోమవారం కిడ్నాప్ నకు గురైన విద్యార్థిని కథ సుఖాంతమైంది. కిడ్నాప్ జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే స్పందించిన గుర్గావ్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. నిందితుల బారి నుంచి విద్యార్థినిని విడిపించారు. ఈ సందర్భంగా గుర్గావ్ పోలీసు కమిషనర్ నవ్ దీప్ సింగ్ విర్క్ మాట్లాడుతూ, సెక్యూరిటీ కెమెరా ఆధారంగా కిడ్నాప్ చేసిన కారును గుర్తించామన్నారు. కిడ్నాప్ నకు గురైన సమాచారాన్ని ఢిల్లీ పోలీసులకు సమాచారమిచ్చి అలర్ట్ చేశామన్నారు. ఎంజీ రోడ్డులోని 'గురు ద్రోణాచార్య' కళాశాలలో చదువుతున్న విద్యార్థిని ఉదయం 9.45 గంటల సమయంలో కిడ్నాప్ నకు గురైందన్నారు. నంబరు ప్లేట్ లేని వైట్ మారుతి స్విఫ్ట్ కారులో ముగ్గురు యువకులు వచ్చారన్నారు. కళాశాల వెనుక గేటు వద్ద ఈ సంఘటన జరిగిందని చెప్పారు. ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగడంతో విద్యార్థిని ఆచూకీ లభించిందని, ఆమెను నిందితుల బారి నుంచి విడిపించామని, ఆమె క్షేమంగా ఉందని చెప్పారు. విద్యార్థినిని కిడ్నాప్ చేసిన వ్యక్తులు ఆమెకు తెలిసిన వారేనని చెప్పారు. నిందితులను గుర్తించామని, త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని నవ్ దీప్ సింగ్ పేర్కొన్నారు. సదరు విద్యార్థిని పసుపుపచ్చ రంగు సల్వార్, ఎరుపు దుపట్టా ధరించినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు.