: రమదీ మాదే... ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై విజయాన్ని ప్రకటించుకున్న ఇరాక్ సైన్యం
ఇరాక్ లోని ప్రధాన నగరాల్లో ఒకటైన రమదీ నుంచి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను పూర్తిగా తరిమేశామని ఆ దేశ సైన్యం ప్రకటించింది. సున్నీ వర్గానికి చెందిన ముస్లింల రాజధానిగా పేరున్న రమదీలో అమెరికా శిక్షణ తీసుకున్న ఇరాక్ సైనికులు గత 18 నెలలుగా యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. గతవారంలోనే ఉగ్రవాదులను తుదముట్టించే పని పూర్తి చేశామని ప్రకటించిన ఇరాక్ అధికారులు, ఆపై సాధారణ పౌరులను గుర్తించి, వారి పునరావాస ఏర్పాట్లు చేస్తున్నారు. రమదీ వీధుల్లో ఇరాక్ సైన్యం ట్యాంకర్లు, తేలికపాటి క్షిపణులతో జరిపిన కవాతు ఫుటేజ్ ని, వీధుల్లో నృత్యాలు చేస్తున్న ప్రజల ఆనందాన్ని ఆ దేశ అధికారిక టెలివిజన్ ప్రసారం చేసింది. అన్బర్ ప్రావిన్స్ లో తమ విజయం సంపూర్ణమని వెల్లడించిన అధికారులు, యుద్ధంలో ఎంతమంది మరణించారన్న విషయాన్ని వెల్లడించలేదు.