: కస్టమర్ల ప్రయోజనాల కోసం గూగుల్, ట్విట్టర్ లకు ఫేస్ బుక్ ఆహ్వానం
నెట్ న్యూట్రాలిటీ మాటెలా ఉన్నా, ఖాతాదారులకు ఉచిత ఇంటర్నెట్ సేవలు ప్రారంభించిన ఫేస్ బుక్, తమతో వచ్చి కలవాలని గూగుల్, ట్విట్టర్ లను ఆహ్వానించింది. మరింతమంది ప్రజలను ఆన్ లైన్లోకి తీసుకురావాలంటే, సామాజిక మాద్యమాలు ఉచితంగా అందుబాటులోకి రావాలని ఫేస్ బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ అభిప్రాయపడ్డారు. ఇంటర్నెట్ సేవలను పొందేందుకు ఎటువంటి రుసుము లేకుంటే మరింత మంది స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేస్తారని ఆయన తెలిపారు. తమ స్కీముకు గూగుల్, ట్విట్టర్ కలిసొస్తే ఇక తిరుగుండదన్నది ఫేస్ బుక్ చీఫ్ అభిప్రాయంగా తెలుస్తోంది. కాగా, ఫేస్ బుక్ ఉచిత ఇంటర్నెట్ నిర్ణయాన్ని మైక్రోసాఫ్ట్, ట్రూ కాలర్ సహా పలు స్టార్టప్ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్థికంగా బలంగా ఉన్న ఫేస్ బుక్ వంటి కంపెనీలు ఉచిత ఇంటర్నెట్ అంటూ రావడం, తమ ఆదాయాలపై ప్రభావం చూపుతాయని పలు చిన్న కంపెనీలు వాదిస్తున్నాయి. దిగ్గజ సంస్థల నిర్ణయంతో నెట్ సంఘటితత్వం దెబ్బతింటుందని, టెలికం సంస్థలు తమకు ఆదాయం సమకూర్చే యాప్ లవైపే మొగ్గు చూపుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా, ఫేస్ బుక్ కు ఉచిత నెట్ భాగస్వామిగా ఉన్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ ను, తిరిగి తాము చెప్పేదాకా ఉచిత సేవలు అందించవద్దని ట్రాయ్ మూడు రోజుల క్రితం ఆదేశించిన సంగతి తెలిసిందే.