: సర్కారీ కొలువుకు ఇక ఇంటర్వ్యూలుండవు, గెజిటెడ్ సంతకాలు కూడా అక్కర్లేదు!
ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించేవారికి శుభవార్త. జనవరి 1వ తేదీ నుంచి జూనియర్ లెవల్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉండవు. దీంతో పాటు సర్టిఫికెట్లపై గెజిటెడ్ అధికారులతో సంతకాలు కూడా అక్కర్లేదు. ఈ మేరకు కేంద్రం గతంలోనే ఆదేశాలు జారీ చేయగా, అవి కొత్త సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి. గెజిటెడ్ అధికారుల ప్రమేయం లేకుండా ఉద్యోగార్థులే స్వయంగా ధ్రువీకరణ పత్రాలను స్వీయ సంతకాలతో అధికారులకు అందించవచ్చు. నేటి యువత తప్పుడు సమాచారాన్ని ఇవ్వబోరన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. కేంద్రం నిర్ణయాలను అమలు చేయాల్సిందిగా ఇప్పటికే అన్ని రాష్ట్రాలకూ ఆదేశాలు వెళ్లాయి. గ్రూప్ సీ, డీ విభాగాల్లోని ఉద్యోగాలకు మెరిట్ ఆధారంగా, ఇంటర్వ్యూలు లేకుండా ఉద్యోగాలు దక్కనున్నాయి. దీనివల్ల కింది స్థాయిలో అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చన్నది కేంద్రం అభిమతం.