: జగన్ పై ఆనం ఫైర్!... టీడీపీ నేత హోదాలో తొలిసారి ఘాటు వ్యాఖ్యలు
నెల్లూరు ఆనం బ్రదర్స్ లో పెద్దాయన ఆనం వివేకానందరెడ్డి మీడియా ముందుకు వచ్చారు. ఇందులో కొత్తదనమేముందనుకుంటున్నారా? మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ తరఫున గళం విప్పిన ఆయన తాజాగా టీడీపీ నేత హోదాలో కొద్దిసేపటి క్రితం నెల్లూరులో మీడియా ముందుకు వచ్చారు. వచ్చీరాగానే వైసీపీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. చట్ట సభలంటే జగన్ కు గౌరవం లేదని ఆనం ఆరోపించారు. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చింది దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డేనన్నారు. నాడు తండ్రి బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు జారీ చేస్తే, కాంట్రాక్టర్ల నుంచి జగన్ కమీషన్లు అందుకున్నారని ఆరోపించారు. నాటి ఘటనలను మరిచి, రోజా లాంటి నేతలను తమ పార్టీ నేతలపైకి ఉసిగొల్పుతున్నారని విమర్శించారు. జగన్ కు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదని కూడా ఆనం వ్యాఖ్యానించారు.