: కాబూల్ నుంచి లాహోర్ కు ప్రధాని మోదీ... షరీఫ్ తో భేటీ కానున్నట్లు ట్వీట్స్!
మొన్న రష్యా పర్యటనకు బయలుదేరిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాకుల మీద షాకులిస్తున్నారు. ఆఫ్ఘానిస్థాన్ లో పర్యటించనున్న విషయాన్ని అటు మోదీతో పాటు అధికారవర్గాలు కూడా చివరి నిమిషం దాకా వెల్లడించలేదు. నిన్న రాత్రి రష్యా పర్యటన ముగించుకుని నేటి ఉదయం ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్ లో అడుగుపెట్టేదాకా ఈ విషయం ఎవరికీ తెలియలేదు. భద్రతా కారణాల రీత్యానే మోదీ ఆఫ్ఘాన్ పర్యటనను గోప్యంగా ఉంచినట్లు ఆ తర్వాత అధికార వర్గాలు ప్రకటించాయి. తాజాగా ఆఫ్ఘాన్ లోనూ తన పర్యటన ముగించుకున్న నరేంద్ర మోదీ నేరుగా ఢిల్లీకి రావట్లేదట. పాకిస్థాన్లోని లాహోర్ లో ఆయన విమానం ల్యాండ్ కానుంది. ఈ మేరకు ఆయనే స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు బర్త్ డే విషెస్ తెలిపేందుకు ఫోన్ చేశానని, షరీఫ్ తో మాట్లాడానని ట్వీట్ చేసిన మోదీ... ఆ వెనువెంటనే ఢిల్లీకి తిరుగు ప్రయాణంలో భాగంగా పాక్ నగరం లాహోర్ లో ఆగుతున్నట్లు తెలిపారు. లాహోర్ లో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో నేటి మధ్యాహ్నం భేటీ కానున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. అంటే, కేవలం రష్యా పర్యటనకని చెప్పి బయలుదేరిన మోదీ... తిరుగు ప్రయాణంలో ఆఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్ లలోనూ పర్యటిస్తున్నట్లైంది.