: ఐఎస్ఐఎస్ కొత్త రూలింగ్... ముస్లింల ప్రాణం కోసం బందీల అవయవాలు!
ప్రపంచానికి దడ పుట్టిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కొత్త రూలింగ్ ఒకటి ఇచ్చారు. ఎవరైనా ముస్లిం ప్రాణాలను కాపాడేందుకు మరో వ్యక్తి అవయవాలను తీసుకోవడం తప్పుకాదని స్పష్టం చేశారు. ఈ పని వల్ల అవతలి వ్యక్తి ప్రాణాలు పోయినా ఫర్వాలేదని, ఓ ముస్లిం ప్రాణాలు కాపాడటమే ముఖ్యమని అంటున్నారు. అవయవాల కోసం బందీలను వాడుకోవాలని కూడా నిర్ణయించారు. ఐఎస్ఐఎస్ పరిపాలనపై విడుదలైన కొన్ని డాక్యుమెంట్లు అమెరికాకు చిక్కగా, వాటిల్లో ఉన్న ఈ విషయాలు ఐఎస్ఐఎస్ కు చిక్కిన బందీల పరిస్థితిపై ఆందోళనను మరింతగా పెంచాయి. కాగా, సిరియాపై దాడి చేసిన అమెరికా సైన్యం ఈ దస్త్రాలను చేజిక్కించుకున్నట్టు తెలుస్తోంది. బందీలుగా ఉన్న వారి ఆర్గాన్ లు, అవసరమైన అవయవాలను తొలగించే క్రమంలో వారిపై ఎటువంటి దయ చూపాల్సిన అవసరం లేదని చెబుతూ ఓ ఫత్వా రూపంలో ఆదేశాలు ఉన్నాయని, వీటిని ఇస్లామిక్ స్టేట్ రీసెర్చ్ అండ్ ఫత్వా కమిటీ జారీ చేసిందని తెలుస్తోంది. ఈ ఫత్వా సంఖ్య 68 అని, అవయవాల తొలగింపుతో మరణం సంభవిస్తుందని తెలిసినా, శస్త్రచికిత్సలపై నిషేధం ఉండదని ఈ డాక్యుమెంట్లు చెబుతున్నాయని అమెరికా అధికారులు వెల్లడించారు.