: జీసస్ దేవుడి బిడ్డ కాదు!... అందుకే క్రిస్మస్ వేడుకలకు దూరమంటున్న తస్లీమా నస్రీన్
వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ మరో పెను వివాదం రేపారు. సరిగ్గా క్రిస్మస్ కు ఒక రోజు ముందు ఆమె ట్విట్టర్ వేదికగా క్రైస్తవులకు ఆగ్రహం తెప్పించేలా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. యావత్తు క్రైస్తవ ప్రపంచం దేవుడి బిడ్డగా కొలిచే జీసస్... అసలు దేవుడి బిడ్డే కాదని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంగానే తాను క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం లేదని కూడా తస్లీమా పేర్కొన్నారు. ‘‘నిజమే. అబద్ధాలపై జరుగుతున్న క్రిస్మస్ వేడుకలకు నేను దూరం. జీసస్ తల్లి ముమ్మాటికీ కన్య కాదు. అదే సమయంలో జీసస్ కూడా దేవుడి బిడ్డ కాదు’’ అని ఆమె ట్వీటారు. తస్లీమా ధైర్యాన్ని మెచ్చుకుంటూ కొంతమంది రీట్వీట్లు చేయగా, మరికొందరు ఆమె వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.