: క్రీస్తు జన్మదినం నేడు... క్రైస్తవులతో కిటకిటలాడుతున్న చర్చిలు
క్రైస్తవుల ఆరాధ్య దైవం క్రీస్తు జన్మదినం నేడు. క్రిస్మస్ పేరిట జరుపుకునే క్రీస్తు జన్మదిన వేడుకలతో విశ్వవ్యాప్తంగా క్రైస్తవుల ప్రార్థనాలయాలైన చర్చిలు నేటి తెల్లవారుజాము నుంచే కిటకిటలాడుతున్నాయి. అర్ధరాత్రి నుంచే ప్రార్థనాలయాలకు వచ్చిన క్రైస్తవులు ప్రార్థనల్లో మునిగిపోయారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే... తెలంగాణలోని మెదక్ లోని ప్రఖ్యాత చర్చి ప్రాంగణం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రైస్తవులతో కిటకిటలాడుతోంది. సికింద్రాబాదులోని ప్రధాన చర్చిలన్నింటిలోనూ క్రైస్తవుల రద్దీ నెలకొంది. శీతాకాల విడిది కోసం హైదరాబాదు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ క్రిస్మస్ ను పురస్కరించుకుని క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావులు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటనలు విడుదల చేశారు.