: అజిత్ దోవల్...గ్రేట్ ఇండియన్ గూఢచారి!: పాక్ లో ఏడేళ్ల పాటు ముస్లింగా గడిపిన వైనం


జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నిజంగా గ్రేట్ ఇండియన్ గూఢచారే. ఎందుకంటే భారత ఏజెంట్ గా పాకిస్థాన్ నగరం లాహోర్ లో ఏడేళ్ల పాటు పాకిస్తాన్ ముస్లిం వ్యక్తిగా గడిపారు. ఈ సందర్భంగా శత్రు దేశానికి సంబంధించి పలు కీలక వ్యవహారాల సమాచారాన్ని ఆయన గుట్టుచప్పుడు కాకుండా తీసుకొచ్చారు. కేరళ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన దోవల్, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా 2005లో పదవీ విమరణ చేశారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ ను ఏరికోరి నియమించుకున్నారు. ప్రధాని తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా దోవల్ కూడా రాణిస్తున్నారు. 30 ఏళ్లకు పైగా దొరకకుండా తిరుగుతున్న మాఫియా డాన్ చోటా రాజన్ ను విదేశీ గడ్డపై అరెస్ట్ చేయించారు. చోటా రాజన్ ను బాలి పోలీసులు అరెస్ట్ చేసినా, ఆపరేషన్ వెనుక మొత్తం వ్యవహారం నడిపింది అజిత్ దోవలేనన్న విషయమూ తెలిసిందే. పోలీసు వృత్తిలో దోవల్ చేసిన సాహసాలు, గూఢచారిగా ఆయన తన ప్రాణాలను పణంగా పెట్టి వ్యవహరించిన తీరుకు సంబంధించి ఇప్పటిదాకా వేరే ఎవరో చెబితేనే మనం విన్నాం. తాజాగా ఇండియన్ జేమ్స్ బాండ్ గా వినుతికెక్కిన అజిత్ దోవలే స్వయంగా తన సాహసాలను వెల్లడించారు. నిన్న ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన తాను పాక్ లో ఏడేళ్ల పాటు ముస్లిం వ్యక్తిగా గడిపిన వైనాన్ని కళ్లకు కట్టినట్లు వెల్లడించారు.

  • Loading...

More Telugu News