: ఏపీ టీడీపీకి అనుబంధంగా అంగన్ వాడీ విభాగం... త్వరలో రిజిస్ట్రేషన్
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి మరో అనుబంధ విభాగం ఏర్పాటు కాబోతుంది. ప్రస్తుతం టీడీపీకి యువత, విద్యార్థి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా, కార్మిక, ఉపాధ్యాయ విభాగాలు అనుబంధంగా పని చేస్తున్నాయి. కొత్తగా అంగన్ వాడీ వర్కర్లతో అనుబంధ విభాగాన్ని రిజిస్టర్ చేయించబోతున్నారు. దానికి ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు నుంచి కూడా అనుమతి లభించింది. 'తెలుగునాడు అంగన్ వాడీ ట్రేడ్ యూనియన్' పేరుతో వచ్చే సోమవారం (ఈ నెల 28)న అనుబంధ విభాగాన్ని రిజిస్టర్ చేయిస్తున్నారని తెలిసింది. యూనియన్ సింబల్ గా తల్లీబిడ్డతో కూడిన లోగోను తయారు చేయించారు. 36 మందితో రాష్ట్ర కమిటీని వేయనున్నారు. తరువాత జిల్లా, మండల స్థాయిలో అడహక్ కమిటీలు ఏర్పాటు చేస్తారు. తరువాత పార్టీ సభ్యత్వం నమోదు మాదిరిగా అంగన్ వాడీ యూనియన్ కు సభ్యత్వ నమోదు చేపట్టనున్నారు.