: ఆ నలుగురూ మైనర్లే!... ఢిల్లీ కోర్టు కాల్పుల నిందితులను చితకబాదిన లాయర్లు
దేశంలో నేరాలకు పాల్పడుతున్న మైనర్ల సంఖ్య నానాటికి పెరుగుతోంది. నిర్భయ ఘటనలో బాధితురాలిపై పాశవికంగా దాడి చేసిన నిందితుడు మైనరన్న విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ తో ఏకంగా జువనైల్ జస్టిస్ చట్టానికి సవరణ కూడా జరిగిపోయింది. ఇక దాద్రి ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసిన 15 మంది నిందితుల్లోనూ ఓ మైనర్ ఉన్నాడన్న వార్త కలకలం రేపుతోంది. తాజాగా ఢిల్లీలోని కర్కర్ దూమా కోర్టు హాలులో నిన్న కాల్పులకు దిగిన నలుగురు నిందితులూ మైనర్లేనట. వారంతా 16- 18 ఏళ్ల మధ్య వయస్కులేనని ఢిల్లీ జాయింట్ పోలీస్ కమిషనర్ సంజయ్ బనివాల్ చెప్పారు. సదరు మైనర్లను సాహిల్, గోవింద్, సన్నీ, సునీల్ లుగా గుర్తించారు. తమ ప్రత్యర్థి గ్యాంగ్ కు చెందిన వ్యక్తిని మట్టుబెట్టేందుకు తుపాకులు చేతబట్టి కోర్టు ప్రాంగణంలోకి వచ్చిన ఆ నలుగురిలో ఇద్దరు తలుపు వద్ద కాపలా కాయగా, మరో ఇద్దరు కోర్టు హాలులోకి వెళ్లి కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో నిందితులు టార్గెట్ చేసిన గ్యాంగ్ స్టర్ కు స్వల్ప గాయాలు కాగా, ఓ కానిస్టేబుల్ చనిపోయాడు. కాల్పుల అనంతరం పరారయ్యేందుకు యత్నించిన నలుగురు మైనర్లను చుట్టుముట్టి నిలువరించిన న్యాయవాదులు వారిని చితకబాది పోలీసులకు అప్పజెప్పారు.