: ‘హోదా’పై చిగురిస్తున్న ఆశలు... నేడు బెజవాడకు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పనగారియా
ప్రత్యేక హోదాపై ఏపీ ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్థిక లోటుతో సతమతమవుతున్న రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వాలని నవ్యాంధ్ర ప్రజలు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో అవకాశం చిక్కినప్పుడల్లా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వం ముందు గళం విప్పుతూనే ఉన్నారు. 14వ ఆర్థిక సంఘం నిబంధనలు రాష్ట్రాలకు ప్రత్యేక హోదాకు అడ్డుగా నిలుస్తాయని నిన్నటిదాకా చెప్పుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఏపీ సర్కారు వినతితో ఈ అంశంపై అధ్యయనం చేయాలని నీతి ఆయోగ్ కు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వంలోని పలు ప్రభుత్వ విభాగాలతో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా విడతల వారీగా సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలు నివేదికలు తెప్పించుకుని పరిశీలించారు. ఈ క్రమంలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆయన దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిపై నిన్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై నీతి ఆయోగ్ సానుకూలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. దీనిపై త్వరలోనే స్పష్టమైన ప్రకటన రానుందని కూడా సుజనా చెప్పారు. ఇదిలా ఉంటే, నేడు పనగారియా విజయవాడకు వస్తున్నారు. చంద్రబాబుతోనూ ఆయన భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకునే స్థాయిలో ఉన్న పనగారియా విజయవాడ పర్యటనపై ఏపీ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.