: ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను... క్షమించండి: లోక్ సభ స్పీకర్
కాంగ్రెస్ సభ్యులపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే, లోక్ సభ సమావేశాల్లో తమ డిమాండ్ల సాధన కోసం కాంగ్రెస్ సభ్యులు నిన్న స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలో, వారిని నియంత్రించే క్రమంలో వారికి 'దేశ ప్రయోజనాలు పట్టవు, స్వప్రయోజనాలే వారికి ముఖ్యం' అని వ్యాఖ్యానించారు. దీనిపై ఈ రోజు సభలో పెద్ద దుమారం రేగింది. స్పీకర్ మాటలు తమ మనసులను తీవ్రంగా గాయపరిచాయని ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. దీంతో, సుమిత్ర స్పందించారు. తాను ప్రత్యేకంగా ఏ ఒక్క పార్టీని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని... తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని... క్షమించండని అన్నారు. తన వ్యాఖ్యలను రికార్డుల నుంచి కూడా తొలగిస్తున్నట్టు ప్రకటించారు.