: కక్ష సాధింపులకు దిగితే...అంతు చూస్తా: రోజా


ముఖ్యమంత్రి చంద్రబాబును దళితులు నమ్మరని వైఎస్సార్సీపీ నేత రోజా స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, అంబేద్కర్ అంటే ప్రేమ ఉన్నట్టు చంద్రబాబు నటిస్తున్నారని, అదంతా నటన అని అన్నారు. అంబేద్కర్ మీద అంత ప్రేమ ఉంటే కనుక ఆయన రచించిన రాజ్యాంగాన్ని అక్షరం పొల్లుపోకుండా అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వం రుణాలు ఇవ్వకపోవడం వల్లే ప్రజలు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని, ఆ బలహీనతను అడ్డం పెట్టుకుని ఆడ కూతుళ్లను వ్యభిచారం రొంపిలోకి లాగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించడం తప్పా? అని ఆమె నిలదీశారు. తాను టీడీపీలో ఉండగా వాడిన భాష తప్పు కానప్పుడు, వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు వాడితే తప్పు ఎలా అవుతుందని ఆమె అడిగారు. ఎమ్మార్వో వనజాక్షి కేసులో చంద్రబాబు మధ్యవర్తిగా సెటిల్ చేశారనడం నిజం కాదా? అని అడిగారు. రిషితేశ్వరి కేసును ఏం చేశారు? కేవలం తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులని నిందితులను వెనకేసుకురావడం నిజం కాదా? అని ప్రశ్నించారు. అలాగే, పలు ఆరోపణలు వచ్చిన మంత్రి నారాయణపై ఏ చర్యలు తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో పాలన దిగజారిపోతోందని తాను సూచిస్తే కక్ష కడతారా? అని అన్నారు. తానింత వరకు నమ్మకపోయినా...ఎన్టీఆర్ లాంటి వ్యక్తిని పదవి కోసం వెన్నుపోటు పొడిచారంటే నమ్మాల్సి వస్తుందని ఆమె అన్నారు. అలాగే తనపై లేనిపోని ఆరోపణలతో మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు విరుచుకుపడుతున్నారే...అంగన్వాడీ మహిళలను కొడితే వీరు ఏం చేస్తున్నారని అడిగారు. తనను లక్ష్యంగా చేసుకుని కక్ష సాధింపులకు దిగితే...అంతు చూసేందుకు కూడా వెనుకాడేది లేదని ఆమె హెచ్చరించారు.

  • Loading...

More Telugu News