: కేజ్రీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు... దావా వేసి జైట్లీ తప్పు చేశారన్న జెఠ్మలానీ
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ల మధ్య నెలకొన్న డీడీసీఏ వివాదం కీలక మలుపులు తీసుకుంది. అరుణ్ జైట్లీ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది. కేజ్రీవాల్ తో పాటు మరో ఐదుగురికి కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా ఈ నోటీసులకు స్పందించాలని కోర్టు సూచించింది. ఇదిలా ఉంటే, కేజ్రీవాల్ పై పరువు నష్టం దావా వేసి జైట్లీ పెద్ద తప్పే చేశారని బీజేపీ మాజీ నేత, ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ సంచలన వ్యాఖ్య చేశారు. కేజ్రీ తరపున వకాల్తా పుచ్చుకున్న జెఠ్మలానీ కోర్టులో జైట్లీ వాదనను తిప్పికొట్టేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఓ ఆంగ్ల వార్తా సంస్థకు నేటి ఉదయం ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టులో విచారణ సందర్భంగా తాను జైట్లీని క్రాస్ ఎగ్జామిన్ చేస్తానని కూడా జుెఠ్మలానీ ప్రకటించారు.