: ఏఎన్నార్ చమత్కారం ... తమన్నా సిగ్గుల సింగారం
అక్కినేని నాగచైతన్య, సునీల్ హీరోలుగా నటిస్తున్న 'తడాఖా' చిత్రం ఆడియో వేడుక హైదరాబాదు శిల్పకళావేదికలో ఈ సాయంకాలం ఘనంగా జరిగింది. ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు ఆడియో సీడీలను విడుదల చేయగా, 'గ్రీకువీరుడు' నాగార్జున తొలి సీడీని స్వీకరించారు. ఈ సందర్భంగా అక్కినేని మాట్లాడుతూ "ఇది ఆడియో ఫంక్షన్ లా లేదు. సిల్వర్ జూబ్లీ వేడుకలా వుంది. అంత ఘనంగా చేశారు. ఇందులో రొమాంటిక్ హీరో చైతన్య. హ్యూమర్స్ హీరో సునీల్ నటించారు. శృంగారం, హాస్యం కలిస్తే ఇక జీవితం హాయిగా వుంటుంది. నాకు హాస్యమంటే ఎంతో ఇష్టం. అందుకే, రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నా, అప్పట్లో అడిగి మరీ 'మిస్సమ్మ' సినిమాలో కామెడీ హీరోగా చేశాను. ఇక తమన్నాను చూస్తుంటే నాకూ విగ్గు పెట్టుకుని డ్యాన్సులు చేయాలని వుంది. అయితే, నాకు దక్కని ఆ చాన్సు నా మనవడికి దక్కింది" అంటూ చమత్కరించారు. ఏఎన్నార్ మాటలకి సభికులు క్లాప్స్ కొడితే, తమన్నా సిగ్గుతో ముసిముసి నవ్వులు నవ్వింది.
నాగార్జున చెబుతూ, "ఈవేళ నేను కాస్త ఎమోషనల్ గా మాట్లాడతాను. ఈ ఏడాది మాకు అన్నీ బాగున్నాయి . కానీ, ఇంట్లో ఏదో వెలితి... చైతన్యకు హిట్టు లేదని . ఆ సమయంలో బెల్లంకొండ సురేష్ వచ్చారు . 'వెట్టై' సినిమా ప్రపోజల్ తెచ్చారు. అప్పుడే అనుకున్నాను ఇది హిట్టని. తర్వాత మాధవన్ పాత్ర ఎవరేస్తే బాగుంటుందని ఆలోచించాం. తర్వాత సునీల్ అని చెప్పారు. అతనంటే నాకు చాలా ఇష్టం. మంచి వాడు. షూటింగులో రోజల్లా నవ్విస్తూ ఉంటాడు. ఇక ఈ టీజర్ చూడగానే సినిమా హిట్టనిపించింది . అలాగే తమన్నా... బాగా చేస్తోంది. త్వరలో మనం కూడా ఓ సినిమా చేద్దాం" అన్నారు