: గాల్లో ఉండగానే పగిలిన విమానం అద్దం... వెనక్కు మళ్లించిన పైలట్
భారత గగన తలంలో నిన్న పెను ప్రమాదమే తప్పింది. నిండా ప్రయాణికులతో గాల్లోకి ఎగిరిన ఎయిర్ ఇండియా విమానం ముందు అద్దం గాల్లోనే పగిలిపోయింది. అయితే ప్రమాదాన్ని వెనువెంటనే గమనించిన పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. వివరాల్లోకెళితే... నిన్న ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టు నుంచి 150 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా విమానం ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోకు బయలుదేరింది. టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపట్లోనే కాక్ పిట్ ముందున్న అద్దం పగిలిపోయింది. దీనిని గమనించిన పైలట్ ఏటీసీకి సమాచారాన్ని చేరవేశాడు. ఏటీసీ ఆదేశాలతో పైలట్ విమానాన్ని తిరిగి ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులోనే కిందకు దించేశాడు. విమానం కిందకు దిగేదాకా అద్దం పగిలిపోయిన విషయం ప్రయాణికులకు తెలియలేదు. అయితే పెను ప్రమాదం నుంచి తప్పించి, విమానాన్ని సురక్షితంగా కిందకు దించిన పైలట్ ను ప్రయాణికులు అభినందించారు.