: అనుకున్న సమయానికి కొత్త విమానాలు రావు: ఇండిగో
ఇండియాలో మార్కెట్ వాటా పరంగా మిగతా ఎయిర్ లైన్స్ కన్నా ముందున్న ఇండిగో విస్తరణ ప్రణాళికల అమలు విషయంలో మాత్రం వెనుకబడుతోంది. మొత్తం 430 'ఎయిర్ బస్ ఏ 320 నియో' విమానాల కొనుగోలుకు ఆర్డరిచ్చిన సంస్థ ఈ నెల 30న తొలి విమానాన్ని డెలివరీ తీసుకోవాల్సి ఉండగా, సాంకేతిక కారణాల వల్ల డెలివరీ ఆలస్యం కానుందని వెల్లడించింది. ఈ మేరకు స్టాక్ ఎక్స్ఛేంజీలకు ప్రకటన వెలువరుస్తూ, "ప్రస్తుతానికి ఏ 320 నియోల డెలివరీపై మాకింకా స్పష్టత రాలేదు. డెలివరీ షెడ్యూల్ మరింత ఆలస్యం కావచ్చు. కొత్త విమానాల కొనుగోలు విషయమై ఇతర మార్గాలను అన్వేషిస్తున్నాం" అని ఇండిగో వెల్లడించింది. కాగా, ప్రస్తుతం ఇండిగో వద్ద ఎయిర్ బస్ అందిస్తున్న ఏ 320 విమానాలు 98 ఉన్నాయి. 2017 మార్చిలోగా మరో 23 విమానాలను జోడించాలన్నది సంస్థ ఆలోచన. గత సంవత్సరంలో 12 కొత్త విమానాలను సంస్థ డెలివరీ తీసుకుంది.