: పాకిస్థాన్ లో మూడేళ్ల బాలుడిపై కబ్జా కేసు...మండిపడిన న్యాయస్థానం
మూడేళ్ల బాలుడిపై భూకబ్జా కేసు నమోదైన ఘటన పాకిస్థాన్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...ఇస్లామాబాద్ లోని ఓ మూడేళ్ల బాలుడు భూమిని ఆక్రమించుకుని ఆస్తుల దొంగతనానికి పాల్పడ్డాడంటూ పోలీసులు న్యాయస్థానంలో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ చూసి నిర్ఘాంతపోయిన న్యాయమూర్తి సంబంధిత లీగల్ కౌన్సిల్ ద్వారా కేసు పూర్వాపరాలు తెలుసుకున్నారు. బాలుడిపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో అరెస్టు చేస్తారేమోనన్న భయంతో బాలుడి కుటుంబ సభ్యులు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారని న్యాయమూర్తికి వివరించారు. దీనిపై న్యాయమూర్తి విచారించగా, పోలీసుల తప్పిదం వల్ల ఈ ఘటన చోటుచేసుకున్నట్టు గుర్తించారు. దీంతో ఆగ్రహించిన న్యాయస్థానం పోలీసులకు చీవాట్లు పెట్టి హెచ్చరించింది. దీనిపై సంబంధిత అధికారులకు సమన్లు జారీ చేయనున్నట్టు న్యాయస్థానం స్పష్టం చేసింది.