: 'సైనేడ్' మల్లికకు యావజ్జీవ కారాగార శిక్ష... మహిళలను చంపి బంగారం దోచుకోవడమే ఆమె పని!


ఓ మహిళకు ఆహారంలో సైనేడ్ కలిపి ఇచ్చి ఆమె మరణానికి కారణమైన 'సైనేడ్' మల్లిక అనే మహిళకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. దాంతో పాటు రూ.50,000 జరిమానా కూడా కోర్టు విధించింది. మల్లిక వివరాల్లోకి వెళితే... మహిళలను పరిచయం చేసుకుని వారితో స్నేహంగా మాట్లాడటం, అనంతరం ఆహారంలో సైనేడ్ కలిపి ఇచ్చి, వారు చనిపోయాక వారి నుంచి బంగారు ఆభరణాలను దోచుకోవడం మల్లిక పని. ఇలాగే 2007లో బెంగళూరుకు చెందిన ఎలిజబెత్ జోసఫ్ అనే మహిళను పరిచయం చేసుకుని కనకపుర తాలూకా కబ్బాళమ్మ ఆలయంలో పూజలు జరిపించేందుకు వచ్చానని చెప్పి ఆమె గదిలోనే ఓ రాత్రి మల్లిక నిద్రించింది. ఆ రాత్రి ప్రసాదం పేరుతో సైనేడ్ కలిపిన పదార్థాలను ఇచ్చింది. దాంతో ఎలిజబెత్ చనిపోయింది. ఆ వెంటనే ఆమె నుంచి బంగారు ఆభరణాలను దోచుకుని మల్లిక పరారైంది. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు మల్లికను అరెస్టు చేశారు. అనంతరం జరిగిన విచారణలో 'సైనేడ్' మల్లిక తరచూ పేర్లు మార్చుకుని మహిళలను హత్యచేసి దోపిడీలకు పాల్పడినట్టు తేలింది. ఈ కేసుకు సంబంధించిన విచారణ కనకపుర రెండవ జిల్లా సెషన్స్ కోర్టులో జరిగింది. చివరకు 302 సెక్షన్ ప్రకారం మల్లికకు జీవితకాల శిక్ష విధిస్తున్నట్టు న్యాయమూర్తి మహ్మద్ ముజీబుల్లా తుది తీర్పు వెల్లడించారు.

  • Loading...

More Telugu News