: మా నాన్నది ‘సీమ’, అమ్మది ఆంధ్రా... నేను సిసలైన హైదరాబాదీని!: నారా లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిన్న ఆసక్తికర వ్యాఖ్య చేశారు. హైదరాబాదులోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన గ్రేటర్ టీడీపీ ఇన్ చార్జీలు, డివిజన్ అధ్యక్షులతో జరిగిన సమావేశంలో మాట్లాడిన సందర్భంగా పార్టీ నేతల్లో ఉత్సాహం నింపేలా లోకేశ్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తన తండ్రి, పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు రాయలసీమకు చెందిన వారని చెప్పిన లోకేశ్, తన తల్లి నారా భువనేశ్వరి ఆంధ్రాకు చెందిన వారని పేర్కొన్నారు. తాను మాత్రం అసలు సిసలైన హైదరాబాదీనని లోకేశ్ తెలిపారు. హైదరాబాదులోనే పుట్టిన తాను ఇక్కడే పెరిగానని లోకేశ్ చెప్పారు. అందుకే తాను అసలు సిసలైన హైదరాబాదీనని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాదుకు అంతర్జాతీయ ఖ్యాతి రావడానికి టీడీపీనే కారణమని చెప్పారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి భయంతో పారిపోయిన టీఆర్ఎస్, తాజాగా అధికారాన్ని అడ్డు పెట్టుకుని విజయం సాధించేందుకు కుయుక్తులు పన్నుతోందని లోకేశ్ ఆరోపించారు.