: కాంగ్రెస్ ను ప్రసన్నం చేసుకునేందుకు మరో మెట్టు దిగిన మోదీ సర్కారు!
సంస్కరణల అమలు దిశగా కీలకమైన బిల్లుల ఆమోదానికి రాజ్యసభలో కాంగ్రెస్ సహకారం తప్పనిసరైన వేళ, జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్) బిల్లుపై మోదీ సర్కారు మరో మెట్టు దిగింది. ఈ బిల్లుపై ప్రతిపాదనలో ఉన్న ఒక శాతం అదనపు పన్నును వెనక్కు తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వివరించారు. పారిశ్రామికవేత్తలతో సమావేశమైన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. వస్తు సేవల పన్ను 18 శాతం కన్నా లోపుగానే ఉండేలా చూస్తామని ఆయన తెలిపారు. "అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ఒకే విధమైన పన్నులు ఉండాలన్నది మా అభిమతం. ఈ విషయంలో అందరినీ కలుపుకుని పోతాం. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలనూ ఇప్పటికే తీసుకున్నాం. విపక్షాలు కూడా సహకరించాలి" అని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని పార్లమెంటులో తెలిపానని, కొన్ని రాష్ట్రాలు డిమాండ్ చేసినట్టుగా ఒక శాతం అదనపు పన్ను తొలగించే ఆలోచనలో ఉన్నామని అన్నారు. కాగా, ఈ పన్నుతో తాము నష్టపోతామని ఉత్పత్తి రంగంలో దూసుకెళ్తున్న తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే.