: దూడల రాజేష్ తో జగన్ కు ఉన్న సంబంధం ఏమిటి: బొండా ఉమ
ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే గందరగోళంగా మారాయి. కాల్ మనీ వ్యవహారంపై సభ అట్టుడుకుతోంది. 'కాల్ మనీ చంద్రబాబు డౌన్ డౌన్' అంటూ వైకాపా సభ్యులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో సభను పది నిమిషాల పాటు స్పీకర్ వాయిదా వేశారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ లో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ మాట్లాడుతూ, వైకాపాపై నిప్పులు చెరిగారు. ఇంత ఘోరమైన ప్రతిపక్షాన్ని చరిత్రలో ఇంతవరకు చూడలేదని మండిపడ్డారు. కాల్ మనీపై రేపు సమగ్ర చర్చకు సిద్ధమని ప్రకటించినా వైకాపా సభ్యులు ఆందోళన చేయడం దారుణమని బొండా ఉమ అన్నారు. జగన్ తో కాల్ మనీ ప్రధాన నిందితుడు దూడల రాజేష్ బాబు కలిసి దిగిన ఫొటోను మీడియా ప్రతినిధులకు చూపించారు. దూడల రాజేష్ తో జగన్ కు ఉన్న సంబంధమేమిటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. జగన్ విజయవాడ వచ్చినప్పుడల్లా అన్ని ఏర్పాట్లు చేసేది దూడల రాజేషేనని చెప్పారు. కాల్ మనీ బాధితులకు ప్రభుత్వం అండగా ఉండటాన్ని వైకాపా నేతలు భరించలేక పోతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై అన్ని విధాలుగా దర్యాప్తు చేస్తున్నామని... దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.