: 350 మందిని నిలబెట్టి కాల్చేశారు...80 మందిని సజీవ సమాధి చేశారు... తాజాగా వెలుగు చూసిన ఐఎస్ దురాగతాలు!
ఐఎస్ఐఎస్ అరాచకాలు ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయి. 2014 ఆగస్టు 3న ఇరాక్ లోని సింజార్ పర్వత శ్రేణుల్లోని కొచో గ్రామం సమీపంలోకి వచ్చిన సాయుధ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు గ్రామంలో ఉన్నవారందరినీ మైదానంలోకి రావాలని హెచ్చరికలు జారీ చేశారు. తమ బారి నుంచి ఎవరూ తప్పించుకోలేరని, స్వచ్చందంగా బయటకు వస్తే ఎవరినీ ఏమీ చేయమని హామీ ఇచ్చారు. దీంతో పిల్లాపాప అనే తేడా లేకుండా అంతా మైదానం చేరుకున్నారు. పురుషులు, స్త్రీలు వేర్వేరుగా విడిపోవాలని సూచించారు. 350 మంది పురుషులను సింజార్ పర్వతాలకు తీసుకెళ్తున్నట్టు తెలిపారు. అనంతరం వారిని గ్రామ శివారుల్లోని పంటపొలాల్లో వరుసగా నిలబెట్టి కాల్చేశారు. మహిళలలో వృద్ధులను వేరు చేశారు. అలా 80 మంది వృద్ధులను సజీవ సమాధి చేశారు. అనంతరం తమతోపాటు యువతులు, మహిళలను తీసుకెళ్లారు. ఈ ప్రాంతాన్ని ఇటీవల కుర్దు బలగాలు కనుగొన్నాయి. దీంతో ఈ ఘోరం వెలుగు చూసింది.