: అమెరికాలో ఘోరం... ఐఎస్ఐఎస్ ఉగ్రవాదివంటూ భారత సంతతి క్లర్కు ముఖంపై కాల్పులు
అమెరికాలో దారుణం జరిగింది. ఓ స్టోర్ లో క్లర్కుగా పనిచేస్తున్న భారత సంతతి వ్యక్తి (34)ని ఐఎస్ఐఎస్ ఉగ్రవాది వంటూ స్టోర్ లో దోపిడీ చేసేందుకు వచ్చిన దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో బాధితుడి గడ్డంలోకి బులెట్ దూసుకుపోగా, ప్రాణాపాయం తప్పినట్టు తెలుస్తోంది. అమెరికన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇండియా నుంచి అమెరికాకు వెళ్లిన సిక్కు వ్యాపారవేత్త ఇంద్రజిత్ సింగ్ ఓ స్టోర్ ను నడుపుతుండగా, అక్కడో భారత సంతతి వ్యక్తి పని చేస్తున్నాడు. స్టోర్ లో ఇంద్రజిత్ కుమార్తె గుర్లీన్ కౌర్ ఉన్న సమయంలో తుపాకీతో దూసుకొచ్చిన దుండగుడు డబ్బివ్వాలని డిమాండ్ చేశాడు. ఆపై క్లర్క్ నోటిలో తుపాకీ పెట్టి, ఐఎస్ఐఎస్ కు చెందిన ఉగ్రవాదివంటూ దుర్భాషలాడాడు. ఆ సమయంలో క్లర్క్ తెలివిగా స్పందించి దుండగుడిని నిలువరించే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనలో తుపాకీ పేలింది. ఆపై కొంత డబ్బును తీసుకుని ఆ దుండగుడు వెళ్లిపోయాడు. ముఖానికి మాస్క్ వేసుకున్న అతన్ని గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. "ఘటనలో ఆ వ్యక్తి ఎంతో ధైర్యంగా స్పందించాడు. ఒకవేళ అతను తుపాకీ బ్యారల్ ను నోటి నుంచి బయటకు తీసే ప్రయత్నం చేయకుంటే ప్రాణాలే పోయేవి" అని గ్రాండ్ రాపిడ్స్ పోలీస్ సార్జంట్ టెర్రీ డిక్సన్ వ్యాఖ్యానించారు. "అమెరికాలో ఏ భారతీయుడికైనా ఇలా జరిగే అవకాశముంది. అతను ఏ ఉద్దేశంతో ఇది చేశాడో నాకు తెలియదు. మేము అమెరికన్లం. అమెరికాలో అమెరికన్ల మాదిరిగా జీవనం సాగించాలన్నదే మా కోరిక" అని గుర్లీన్ కౌర్ వ్యాఖ్యానించారు.