: మల్లాది విష్ణుకు ముందస్తు బెయిల్ కావాలట!... బెజవాడ కోర్టులో పిటిషన్ దాఖలు
బెజవాడలో ఐదుగురు దినసరి కూలీల అకాల మరణానికి కారణమైన కల్తీ మద్యం కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ముందస్తు బెయిల్ కావాలట. నగరంలోని కృష్ణలంకకు చెందిన స్వర్ణ బార్ లో చోటుచేసుకున్న కల్తీ మద్యం ఘటనలో ఐదుగురు చనిపోగా, 29 మంది ఆసుపత్రి పాలై సత్వర చికిత్సతో ప్రాణాలు దక్కించుకున్నారు. సోదరుడి పేరిట బారు నడుస్తుండటం, అందులో తన తల్లికి భాగస్వామ్యం ఉన్న నేపథ్యంలో మల్లాది విష్ణుపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మల్లాది విష్ణు ఏ9గా ఉన్నారు. కేసు నమోదైన మరుక్షణమే అజ్ఞాతంలోకి వెళ్లిన మల్లాది విష్ణు పోలీసులకు చిక్కడం లేదు. తాజాగా ఆయన ముందస్తు బెయిల్ కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా విజయవాడ ఎంఎస్జే కోర్టులో ఆయన తరఫు న్యాయవాదులు నిన్న ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరిగే అవకాశాలున్నట్లు సమాచారం.