: ఈ క్యాలెండర్ పురుషులకు మాత్రమే!
ఈ వస్తువులు స్త్రీలకు, ఫలానా డ్రెస్సులు పురుషులకు... అన్న మాటలు సాధారణంగా వినపడుతుంటాయి. కానీ, ‘ఈ క్యాలెండర్ పురుషులకు మాత్రమే’ అన్న స్టేట్ మెంటే కొంచెం తిరకాసుగానూ, ఒకింత ఆశ్చర్యంగానూ ఉంది కదా! అసలు విషయం ఏమిటంటే.. పురుషుల కోసం ఒక క్యాలెండర్ వచ్చింది. దాని పేరు మేలెండర్. దీని ప్రత్యేకత ఏమిటంటే, పురుషుల కోసం ప్రత్యేకంగా ఉండే దినోత్సవాల వివరాలతో దీనిని రూపొందించడమే. ముంబయికి చెందిన వాస్తవ్ ఆర్గనైజేషన్ అనే ఒక ఎన్జీవో సంస్థ పురుషుల హక్కుల కోసం పాటుపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ క్యాలెండర్ ను తయారు చేసింది. పురుషుల దినోత్సవం, పితృ దినోత్సవం, బాలుర దినోత్సవం.. ఇట్లీ అన్నీ పురుషులకు సంబంధించిన దినోత్సవాల తేదీలను ప్రత్యేకంగా పేర్కొంది. ఈ సందర్భంగా సదరు సంస్థ అధ్యక్షుడు అమిత్ దేశ్ పాండే మాట్లాడుతూ, పురుషుల దినోత్సవాల గురించిన అవగాహన కోసమే దీనిని తయారు చేశామన్నారు. సుమారు రెండు వేల క్యాలెండర్ల వరకు ముద్రించామని, ముఖ్యమైన మెట్రో నగరాల్లో మేలెండర్లను పంపిణీ చేశామని పాండే వెల్లడించారు.