: ఎస్పీలతో చంద్రబాబు ప్రత్యేక సమావేశం... కాల్ మనీపైనే ప్రధాన చర్చ
అధిక వడ్డీలకు అప్పులిచ్చి, రుణాలు తీర్చలేని వారి ఇళ్లను కాజేస్తుండటంతో పాటు సదరు రుణ గ్రహీతల ఇళ్లలోని మహిళలను వ్యభిచార కూపంలోకి లాగుతున్న విజయవాడ కాల్ మనీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ఇప్పటికే ఈ విషయంపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు విజయవాడ పోలీసులకు పోటెత్తాయి. ప్రస్తుతం విజయవాడలో జిల్లా కలెక్టర్లతో సీఎం నారా చంద్రబాబునాయుడు సమావేశం నిర్వహిస్తున్నారు. కాల్ మనీ వ్యవహారం నేపథ్యంలో ఆయన నేడు ఏపీలోని అన్ని జిల్లాల ఎస్పీలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కాల్ మనీ తరహాలో ఎక్కడైనా అధిక వడ్డీలు వసూలు చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేయనున్నారు. కాల్ మనీ వ్యవహారంపై ఉక్కుపాదం మోపేలా కూడా ఆయన ఎస్పీలకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.