: ప్రజలను అప్పుల ఊబిలోకి దింపింది ప్రభుత్వమే: లోక్ సత్తా అధినేత జేపీ


ప్రజలను అప్పుల ఊబిలో దింపేసింది ప్రభుత్వమే నంటూ లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ మండిపడ్డారు. కాల్ మనీ వ్యవహారంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాల నిర్వాకం వల్లే కాల్ మనీ వంటి వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. ఇటువంటి వాటి వల్లే ప్రజలకు ఈ దుస్థితి దాపురించిందన్నారు. రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం బ్యాంకింగ్ వ్యవస్థను భ్రష్టు పట్టించిందని.. అందువల్లే ప్రజలు ప్రయివేట్ వడ్డీ వ్యాపారుల చేతుల్లో చిక్కుకుంటున్నారని అన్నారు. అధికార యంత్రాంగం, రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, పోలీసులు ఒక్కటై వడ్డీ వ్యాపారం పేరిట ప్రజలను పీక్కుతింటున్నారంటూ ఆయన తీవ్రంగా ఆరోపించారు. ప్రజలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని జేపీ సూచించారు. ప్రజలకు తామేదో చేశామంటూ అద్భుతంగా నటిస్తున్న ప్రభుత్వం, ప్రజలను అప్పుల ఊబిలో పడేసిందన్నారు. కాబూలీ వాళ్ల చేతుల్లో ప్రజలను పెట్టేశారని అన్నారు. ఎన్నికల వాగ్దానాలు, ప్రభుత్వ విధానాలు, ఆర్థిక వ్యవస్థకు సంబంధం చూడకుండా.. ఈ రోజున 'వాళ్లు దొంగ, వీళ్లు దొంగ' అని అంటున్న ప్రభుత్వం మాటలు అర్థం లేనివని జయప్రకాష్ నారాయణ విమ్శరించారు.

  • Loading...

More Telugu News