: ప్రధాని కార్యక్రమానికి మీరు రాకపోవడమే మంచిది!... కేరళ సీఎంకు షాకిచ్చిన మలయాళీ కొత్త పార్టీ


ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ నేడు తొలిసారిగా దక్షిణాది రాష్ట్రం కేరళ పర్యటనకు వెళుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోని కేరళలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ దివంగత నేత శంకరన్ విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించనున్నారు. శ్రీ నారాయణ ధర్మ పరిపాలన (ఎస్ఎన్డీపీ) యోగం ప్రధాన కార్యదర్శి, కొత్త రాజకీయ పార్టీకి శ్రీకారం చుడుతున్న వెల్లపల్లి నటేశన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. కేరళలోని కొల్లంలో జరగనున్న ఈ కార్యక్రమానికి హాజరుకావాలని తొలుత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాందీకి కూడా ఆహ్వానం అందింది. అయితే ఆ తర్వాత మనసు మార్చుకున్న నిర్వాహకులు సదరు కార్యక్రమానికి దూరంగా ఉంటేనే మంచిదంటూ చెప్పి చాందీకి షాకిచ్చారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. తొలుత పిలవడమెందుకు, తర్వాత వద్దనడమెందుకంటూ ఆ పార్టీ నేతలు ఎస్ఎన్డీపీ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై నేడు జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో అధికార పక్షాన్ని నిలదీసేందుకు కూడా కాంగ్రెస్ సిద్ధమైంది. ఎస్ఎన్డీపీ వైఖరిపై ఉమెన్ చాందీ కూడా విస్మయం వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రానికి తొలిసారిగా వస్తున్న ప్రదాని నరేంద్ర మోదీ వెంట ఉండాల్సిన అవసరం నాకుంది. శంకర్ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రే కాక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ గా పనిచేశారు. అంతేకాక ప్రొటోకాల్ ప్రకారం సీఎం హోదాలో ప్రధాని వెంట నేను ఉండాల్సి ఉంది. అయితే నిర్వాహకుల కోరిక మేరకు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండేందుకే నిర్ణయించుకున్నాను’’ అని చాందీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, కొత్తగా రాజకీయ పార్టీ పెట్టనున్న నటేశన్, తన పార్టీని బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ మిత్రపక్షంగా ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతల ఆదేశాలతోనే కార్యక్రమానికి రావద్దంటూ సీఎం ఉమెన్ చాందీని నటేశన్ కోరి ఉంటారని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News