: బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ కు పద్మవిభూషణ్ ప్రధానం
బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ కు పద్మవిభూషణ్ పురస్కారం ప్రదానం చేశారు. ముంబయిలోని ఆయన నివాసంలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేతుల మీదుగా దిలీప్ కుమార్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సినీ రంగానికి చేసిన సేవకు గానూ ఆయన్ని పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించారు. కాగా, ఈ ఏడాది జనవరి 25న బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్ లతో పాటు పలువురికి పద్మవిభూషణ్ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ లో రాష్ట్రపతి భవన్ లో ఈ పురస్కార ప్రదానోత్సవం జరిగింది. అయితే, అనారోగ్య కారణాల రీత్యా దిలీప్ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. దీంతో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ రోజున దిలీప్ కుమార్ నివాసానికి వెళ్లి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. గత శుక్రవారం నాటికి దిలీప్ కుమార్ 93వ పడిలోకి అడుగుపెట్టారు.