: త్వరలో విడుదల... రూ. 3 వేలకే ఏడాది ఉచిత బ్రౌజింగ్ తో 4జీ హ్యాండ్ సెట్!
తక్కువ ధరలకు స్మార్ట్ ఫోన్లను తయారు చేసి విక్రయిస్తున్న భారత సంస్థ డేటా విండ్, వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో రూ. 3 వేల ధరలో 4జి హ్యాండ్ సెట్ ను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఈ ఫోన్ కొనుగోలు చేసే వారికి సంవత్సరం పాటు ఉచిత ఇంటర్నెట్ బ్రౌజింగ్ సౌకర్యం అందిస్తామని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీత్ సింగ్ తులి పీటీఐ వార్తా సంస్థకు వెల్లడించారు. ఉచిత అన్ లిమిటెడ్ 4జీ బ్రౌజింగ్ తమ కస్టమర్లకు ఆకర్షణీయమని వెల్లడించిన ఆయన, బ్రౌజింగ్ మాత్రమేనా? ఉచిత వీడియో డౌన్ లోడింగ్ సదుపాయం ఉంటుందా? అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కాగా, 4జీ,3జీ ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోసం రిలయన్స్ కమ్యూనికేషన్స్, టెలినార్ సంస్థలతో డీల్ కుదుర్చుకున్న డేటా విండ్, 4జీ బండిల్డ్ ఆఫర్ కోసం కూడా పలు మొబైల్ కంపెనీలతో చర్చిస్తోంది. ప్రస్తుతం భారత మార్కెట్లో రూ. 4 వేల కనీస ధరలో 4జీ ఫోన్లు లభ్యమవుతున్నాయి. ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న 4జీ టెక్నాలజీని మొబైల్ కస్టమర్లకు దగ్గర చేసేందుకు ఎయిర్ టెల్, ఆర్ కాం వంటి సంస్థలు భారీ ప్రణాళికలను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.