: ఇండియాకు దూరం కానున్న కోక-కోలా!
ప్రతిపాదిత 40 శాతం 'సిన్' టాక్స్ (పాపపు పన్ను - సంఘానికి, ప్రజలకు హానికారక ఉత్పత్తులైన సిగరెట్లు, మద్యం వంటి వాటిపై వసూలు చేసే ఎక్సైజ్ సుంకం) అమలు చేస్తే, ఇండియాలోని బాటిలింగ్ ప్లాంట్లను మూసివేస్తామని కోక-కోలా ప్రకటించింది. "పన్నులను పెంచితే, కూల్ డ్రింకుల ధరలను పెంచాల్సి వస్తుంది. దీంతో కొనుగోళ్లు గణనీయంగా తగ్గుతాయి. ఈ పరిస్థితుల్లో ఫ్యాక్టరీలను మూసివేయడం మినహా మరో మార్గం లేదు" అని కోక-కోలా ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 57 ఫ్యాక్టరీలను నిర్వహిస్తున్న కోక-కోలా పలు రకాల శీతల పానీయాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ పొగాకు, మద్యం ఉత్పత్తులపై విధిస్తున్న సిన్ టాక్సు ను సోడాలు వంటి కార్బొనేటెడ్ పానీయాలపై విధించాలని కేంద్రం ప్రతిపాదించగా, కోక-కోలా స్పందించింది. ఈ పన్ను తమ వ్యాపారాన్ని ఘోరంగా దెబ్బతీస్తుందని తెలిపింది. ఈ పానీయాలు స్థూలకాయాన్ని పెంచుతాయని, ఆరోగ్యానికి హానికరమేనని చెబుతూ, సిన్ టాక్స్ పరిధిలోకి శీతల పానీయాలను తీసుకురావాలన్నది కేంద్రం ఆలోచన. భారత అపార పానీయాల మార్కెట్ పై మంచి పట్టున్న కోల-కోలా ప్రస్తుతం 25 వేల మంది ఉద్యోగులతో కార్యకలాపాలు సాగిస్తోంది. 2020 నాటికి 5 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 32 వేల కోట్లు) పెట్టుబడులతో విస్తరణ, అభివృద్ధి కోసం ప్రణాళికలను రూపొందించింది. ఇప్పుడీ సిన్ టాక్స్ తో అవన్నీ ఆగిపోయే పరిస్థితి నెలకొందని సంస్థ చెబుతోంది.