: జనవరి 1-15వ తేదీ వరకు ఢిల్లీలో పాఠశాలలు మూసివేత!
వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి 15 వరకు ఢిల్లీలోని పాఠశాలలు మూతపడనున్నాయి. ఢిల్లీలో వాతావరణ కాలుష్యం పెరిగిపోతున్న కారణంగా రోజు విడిచి రోజు విధానంలో ప్రైవేట్ వాహనాలను రోడ్లకు అనుమతించే పద్ధతి జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా మాట్లాడుతూ, ‘పాఠశాలల సిబ్బందిని సంప్రదించిన అనంతరం ఈ విషయమై ఒక నిర్ణయం తీసుకోనున్నాం. ఢిల్లీ పాఠశాలల్లో మొత్తం 26 లక్షల మంది విద్యార్థులు ఉంటారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలను మూసివేయాలన్న ఒక ప్రతిపాదన ఉంది. దీని గురించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనున్నాము’ అని ఆయన పేర్కొన్నారు. కాగా, పాఠశాలల విద్యార్థులు వాతావరణ కాలుష్యానికి గురికాకుండా ఉండేందుకుగాను ఢిల్లీలోని పలు ప్రైవేట్ పాఠశాలలు తగు జాగ్రత్తలు ఇప్పటికే తీసుకున్నాయి. వాతావరణ కాలుష్యం కారణంగా శ్రీరామ్ స్కూల్, వసంత విహార్ పాఠశాలల్లో నిర్వహించాల్సి ఉన్న స్పోర్ట్స్ డే ను వాయిదా వేస్తున్నట్లు ఇప్పటికే ఒక ప్రకటన కూడా చేశారు. వసంత్ వ్యాలీలో పాఠశాలలో జరగాల్సి ఉన్న ఫుట్ బాల్ మ్యాచ్ కూడా వాయిదా పడింది. వాతావరణ కాలుష్యం ఉన్నందున ఉదయం సమయాల్లో బయటకు రావద్దంటూ బ్రిటిష్ స్కూల్ తమ విద్యార్థులకు సూచించింది. వాతావరణ కాలుష్యానికి సంబంధించి ఢిల్లీలోని ఆర్కే పురంలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం కూడా తమ విద్యార్థులకు పలు సూచనలు చేస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులకు సమచారమందిస్తోంది. విద్యార్థులతో ఉదయం సమయంలో అవుట్ డోర్ లో నిర్వహించే అన్ని కార్యక్రమాలను ఆపి వేశామని, ప్రతి పాఠశాలకు త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తామని ఒక అధికారి చెప్పారు.