: కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ హైకోర్టు ముందు టి.లాయర్ల నిరసన
తెలంగాణ న్యాయవాదులు మరోసారి నిరసన బాట పట్టారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాదులోని ఇరు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఎదుట వారు నిరసనకు దిగారు. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. నిర్లక్ష్యాన్ని వీడాలని, రాజ్యాంగాన్ని, ఆర్టికల్ 214ను గౌరవించాలని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా హైకోర్టు వద్ద స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. పరిస్థితి చేజారకుండా పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు.