: సల్మాన్ ను నిర్దోషిగా ప్రకటించిన క్షణాన ... కోర్టులో జరిగిందిదే!


గత నాలుగైదు రోజులుగా 'హిట్ అండ్ రన్' కేసులో బాంబే హైకోర్టు చేస్తున్న వ్యాఖ్యలను నిశితంగా గమనిస్తున్న వారంతా ఈ కేసులో సల్మాన్ బయటపడతాడనే భావించారు. అయితే, వారందరు అనుకున్నది ఏమంటే, బెయిల్ కొనసాగిస్తూ, మరింత పకడ్బందీగా సాక్ష్యాలు కావాలని కోర్టు చెబుతుందని, ఇంకాస్త సమయం సల్మాన్ కు దొరుకుతుందని! అయితే, నిన్న కోర్టులో జరిగింది వేరు. సల్మాన్ కు అన్ని అభియోగాల నుంచి విముక్తి లభించింది. బాంబే హైకోర్టు రూం నంబర్ 43లో, న్యాయమూర్తి ఏఆర్ జోషి తన తీర్పులోని తుది వాక్యాలు చదువుతున్న సమయంలో అందరిలో తీవ్ర ఉత్కంఠ. ఓ వైపు సల్మాన్ నిలుచుని ఉన్నాడు. అతని పక్కనే న్యాయవాదులు ఓ వైపు, తీర్పు ఏ మాత్రం సల్మాన్ కు వ్యతిరేకంగా ఉన్నా తక్షణం అరెస్ట్ చేసి జైలుకు తరలించాలని చూస్తున్న పోలీసులు మరోవైపు, కాస్తంత దూరంలో ఆతృతతో ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు. కోర్టు బయట నాలుగు అడుగులు ఉన్న కిటికీలు ఎక్కి మరీ తీర్పు వింటున్న అభిమానులు, ఇతర న్యాయవాదులు. ఇక తీర్పు తుది వాక్యాలు విన్న తరువాత, ప్రతి ఒక్కరూ కోర్టు నిబంధనలు ఏమిటన్నది మరచిపోయారు. న్యాయస్థానంలో ఎవరూ న్యాయాన్ని పాటించలేదు. సల్మాన్ కు దగ్గరగా వెళ్లి అభినందించాలని ఎందరో లాయర్లు ప్రయత్నించారు. వారిలో ప్రాసిక్యూషన్ న్యాయవాదులూ ఉండటం గమనార్హం. తీర్పు చదవడాన్ని ముగించిన మరుక్షణం న్యాయమూర్తి తన చైర్ లో నుంచి లేచి వెళ్లిపోతే, ఆయన కుర్చీని కూడా పక్కకు నెట్టేశారు. అభిమానులు కోర్టులో ఎంత అతిగా ప్రవర్తించారంటే, సల్మాన్ సోదరి అర్పిత, అల్విరాలు కూడా అతన్ని చేరలేకపోయారు. అభిమానులు, పోలీసులు, న్యాయవాదులు ఆయన్ను చుట్టుముట్టారు. సల్మాన్ వ్యక్తిగత బాడీగార్డులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఇక సల్మాన్ బెయిల్ బాండ్ రద్దయి సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటికి బయలుదేరే వరకూ ఇదే పరిస్థితి.

  • Loading...

More Telugu News