: ఆ ముగ్గురు హేతువాదుల హంతకులు ఒకరేనా?
కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన ప్రముఖ రచయిత ఎంఎం కాల్ బుర్గి, మహారాష్ట్రకు చెందిన కమ్మూనిస్టు నేత గోవింద్ పన్సారే, అదే రాష్ట్రానికి చెందిన హేతువాది నరేంద్ర దభోల్కర్ లు ఒకే కారణాలతో హత్యకు గురయ్యారు. నాస్తిక వాదానికి మద్దతు పలికిన వారికి ముందుగా బెదిరింపులు వచ్చాయి. ఆ తర్వాత హత్యకు గురయ్యారు. ఈ మూడు హత్యలు దేశంలో అసహనంపై చర్చకు తెరలేపాయి. దాద్రి ఘటన తర్వాత ఈ అంశాలపై దేశవ్యాప్తంగా రచయితలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. సాహిత్య అకాడెమీ లాంటి ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు వెనక్కి వచ్చేశాయి. ఈ కేసుల దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన పోలీసులు మూడు హత్యలను ఒకే గ్రూపు చేసినట్లుగా అనుమానిస్తున్నారు. కర్ణాటకలోని ధార్వాడ్ లో కాల్ బుర్గిని గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్పి చంపారు. మహారాష్ట్రలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో తొలుత పన్సారే, ఆ తర్వాత దభోల్కర్ లు కాల్ బుర్గి తరహాలోనే హత్యకు గురయ్యారు. ఈ మూడు హత్యలకు దారి తీసిన కారణాలు ఒకేలా ఉండటంతో పాటు జరిగిన క్రమం కూడా ఒకే మాదిరిగా ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ మూడు హత్యా స్థలాల్లో లభించిన బుల్లెట్ కాట్రిడ్జ్ లు ఒకే మాదిరిగా ఉన్నాయి. దీంతో 7.65 ఎంఎం పిస్టల్ తోనే ఈ ముగ్గురు కూడా హత్యకు గురయ్యారని తెలుస్తోంది. ఈ హత్యల వెనుక ‘సనాతన సంస్థ’కు చెందిన వారి హస్తమున్నట్లు కర్ణాటక సీఐడీ పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఈ సంస్థకు చెందిన నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నలుగురు గోవాలోని మార్గోవాలో జరిగిన పేలుళ్లతో సంబంధం ఉన్నవారిగానే పోలీసులు అనుమానిస్తున్నారు.