: 2016-17లో ఏపీలో భారీగా ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణలు
ఆంధ్రప్రదేశ్ లో భారీగా పదవీ విరమణలు జరగబోతున్నాయి. 2016 జూన్ 2 నుంచి 2017 మార్చి 31లోపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో 6,017 మంది రిటైర్ కానున్నారు. ఏపీలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు 3.5 లక్షల మంది ఉన్నారు. వారిలో దాదాపు 2 శాతం మంది రిటైర్ అవుతున్నారు. గతేడాది సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచిన విషయం తెలిసిందే. దాంతో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన 2014 జూన్ 2 నుంచి ఇప్పటివరకు ఎలాంటి పదవీ విరమణలూ జరగలేదు. ఈ క్రమంలోనే 2016-17లో పెద్ద ఎత్తున పదవీ విరమణలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఏడాదిని 'పదవీ విరమణ' నామ సంవత్సరంగా అభివర్ణిస్తున్నారు. వారందరికీ గ్రాట్యుటీ, ఇతర పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించాల్సి ఉండటంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం సుమారు రూ.2వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఆ మేరకు బడ్జెట్ లో కేటాయింపులు పెంచాలని ఆర్థిక శాఖ ఇప్పటికే నిర్దేశించింది.