: ఐఎస్ ఫైనాన్స్ చీఫ్ ను మట్టుబెట్టేశాం!: అమెరికా ప్రకటన
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఆర్థిక విభాగం అధిపతి (ఫైనాన్స్ చీఫ్) అబూ సలేహ్ ను మట్టుబెట్టినట్లు అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. గత నెలాఖరులో తాము జరిపిన వైమానిక దాడుల్లో అబూ సలేహ్ చనిపోయాడని, అతడితో పాటు అతడి ఇద్దరు అనుచరులు కూడా హతమయ్యారని ప్రకటించింది. ఈ మేరకు నిన్న బాగ్దాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన సందర్భంగా అమెరికా మిలటరి అధికార ప్రతినిధి కల్నల్ స్టీవ్ వారెన్ స్పష్టం చేశారు. అబూ సలేహ్ ను ఆయన ఐఎస్ కీలక ఉగ్రవాదుల్లో ఒకడిగానే కాక ఉగ్ర కార్యకలాపాల్లో ఆరితేరిన తీవ్రవాదిగా కూడా అభివర్ణించారు. ఐఎస్ పై యుద్ధానికి సంబంధించి అమెరికా రాయబారి బ్రెట్ మెక్ గుర్క్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.