: సల్మాన్ ఖాన్ నిర్దోషిగా బయటపడ్డాడు... ‘మంధన’ షేరు లాభపడింది!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ‘హిట్ అండ్ రన్’ కేసులో నిర్దోషిగా బయటపడిన వెంటనే ‘మంధన ఇండస్ట్రీస్’ షేరు 12 శాతం మేర లాభపడింది. అయినా సల్మాన్ నిర్దోషిగా బయటపడటానికి, ‘మంధన’ షేరు లాభపడటానికి సంబంధం ఏంటంటారా? సల్మాన్ నిర్వహిస్తున్న 'బీయింగ్ హ్యూమన్' స్వచ్చంద సంస్థతో ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ ‘మంధన ఇండస్ట్రీస్’ వ్యాపార బంధాన్ని ఏర్పరచుకుంది. దీంతో బీయింగ్ హ్యూమన్ కు చెందిన దుస్తుల డిజైనింగ్, తయారీ, పంపిణీ వంటివన్నీ ఈ సంస్థే చూసుకుంటుంది. ముంబై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ‘మంధన’ మొత్తం రాబడిలో ‘బీయింగ్ హ్యూమన్’ బ్రాండ్ దే 10 శాతానికి పైగా ఉంటుంది. సల్మాన్ నిర్దోషిగా బయటపడిన మరుక్షణమే షేర్ మార్కెట్ లో ‘మంధన’ షేరు విలువ అమాంతంగా పెరిగింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఆ కంపెనీ షేరు 12 శాతం మేర పెరిగి రూ.272.75 వద్ద ముగిసింది. ‘మంధన’తో పాటు సల్మాన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న పలు కంపెనీల షేర్లు కూడా స్వల్పంగా లాభపడ్డాయి. ఇక సల్మాన్ తో పలువురు బాలీవుడ్ నిర్మాతలు రూ.200 కోట్ల మేర ఒప్పందాలు చేసుకున్నారు. వీరంతా నిన్నటి కోర్టు విచారణ, తీర్పును ఆసాంతం ఆసక్తిగా గమనించారు.