: భారీ నష్టాల తరువాత యూరప్ అండతో దూసుకెళ్లిన మార్కెట్!
భారత స్టాక్ మార్కెట్ నష్టాల పర్వం ముగిసింది. సెషన్ ఆరంభంలో ఒడిదుడుకుల మధ్య సాగుతూ, నష్టాలు తప్పవనేలా కనిపించిన సూచికలు, మధ్యాహ్నం ఒంటిగంట తరువాత యూరప్ మార్కెట్ల లాభాలతో ప్రభావితమయ్యాయి. కొత్తగా కొనుగోళ్లు వెల్లువెత్తడంతో నిమిషాల వ్యవధిలో 150 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఆపై దూసుకెళ్లింది. గురువారం నాటి ట్రేడింగ్ సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 216.27 పాయింట్లు పెరిగి 0.86 శాతం లాభంతో 25,252.32 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ, 70.80 పాయింట్లు పెరిగి 0.93 శాతం లాభంతో 7,683.30 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.88 శాతం, స్మాల్ క్యాప్ 0.90 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 37 కంపెనీలు మాత్రమే లాభాల్లో నడిచాయి. రిలయన్స్, టాటా స్టీల్, హిందాల్కో, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఆటో తదితర కంపెనీలు లాభపడగా, లుపిన్, మహీంద్రా అండ్ మహీంద్రా, యస్ బ్యాంక్, టాటా మోటార్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తదితర కంపెనీలు నష్టపోయాయి. బుధవారం నాడు రూ. 95,27,980 కోట్లుగా ఉన్న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్, రూ. 96,15,305 కోట్లకు పెరిగింది. మొత్తం 2,849 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,845 కంపెనీలు లాభాలను, 820 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.