: భార్యను, ప్రియుడిని చంపి, ఉరేసుకుంటే తాడు తెగిందంటూ లొంగిపోయిన నేవీ అధికారి
ఓ యువ నేవీ ఆఫీసర్, తన భార్యను, ఆమె ప్రియుడిని దారుణంగా హత్య చేసి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన నవీ ముంబైలో సంచలనం సృష్టించింది. 29 సంవత్సరాల ధృవకాంత్ విమల్ ఠాకూర్ ఈ ఘాతుకానికి ఒడికట్టాడు. ఆపై తాను కూడా ఉరేసుకునేందుకు ప్రయత్నించాడు. మెడకు బిగించుకున్న ఉచ్చు తెగడంతో బతికాడు. ఆపై రక్తపు మరకల మధ్య నింపాదిగా లిఫ్టులో కిందకు వచ్చి, తాను రెండు హత్యలు చేశానని, పోలీసులకు కబురు పెట్టాలని అపార్ట్ మెంట్ వాసులను కోరాడు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ధృవకాంత్, వాట్స్ యాప్ ద్వారా పరిచయమైన సుస్మితను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కమోథీలోని సెక్టార్ 19లో ఈ జంట నివాసం ఉంటున్నారు. ధృవకాంత్ తన ఉద్యోగ బాధ్యతల నిమిత్తం నెల రోజులు, ఒక్కోసారి నెలన్నర కూడా ఇంటికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సెలవు ముగించుకుని ఇంటికి వచ్చిన అతనికి సుస్మిత విడాకుల నోటీసులు ఇచ్చి సంతకం పెట్టమని డిమాండ్ చేసింది. అజయ్ కుమార్ అనే మరో వ్యక్తికి దగ్గరైనట్టు తెలిపి, అతన్ని వివాహం చేసుకునే ఉద్దేశం ఉన్నట్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే వివాదం చెలరేగింది. ఆపై విధి నిర్వహణ కోసం వెళ్లిన ధృవకాంత్, మధ్యలోనే సెలవు పెట్టి ఇంటికి వచ్చాడు. భర్త ఇంటికి వచ్చి ఉంటాడని ఊహించని సుస్మిత, తన ప్రియుడు అజయ్ తో కలసి అపార్టుమెంటుకు వచ్చింది. మంగళవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో ఈ జంట ఇంట్లోకి వెళ్లగా, దాదాపు 12 గంటల తరువాత ధృవకాంత్ బయటకు వచ్చి వారిని హత్య చేసినట్టు చెప్పాడు. అజయ్ కుమార్ గొంతులో పదునైన కత్తితో నిందితుడు పలుమార్లు పొడిచాడని, సుస్మిత ముఖంపై దిండును అదిమిపెట్టి ఊపిరాడనీయకుండా చేసి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. అనంతరం ఆత్మహత్యకు ప్రయత్నించి విఫలమయ్యాడని, అతనిపై హత్యాభియోగం నమోదు చేసి కేసు దర్యాఫ్యు చేస్తున్నట్టు వివరించారు.