: ఐఎస్ఐఎస్ ను కట్టడి చేయలేకపోవడానికి కారణాలివిగో!
ఐఎస్ఐఎస్ ప్రపంచానికి నిద్ర లేకుండా చేస్తున్న ఉగ్రవాద సంస్థ. భవిష్యత్తులో ఇస్లాం సామ్రాజ్యాన్ని స్థాపించి షరియా చట్టాన్ని అమలు చేయాలని ప్రతిన బూనిన ఐఎస్ ఒంటరిగా ప్రపంచాన్ని ఎదుర్కొంటోంది. చిన్న దేశంలో చిన్న ప్రాంతానికి పరిమితమైన ఐఎస్ ప్రపంచంలోనే శక్తిమంతమైన అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల దాడులను ఎలా ఎదుర్కోగలుగుతోంది? సైనిక, ఆయుధ, ఆర్థిక సంపత్తిలో సుసంపన్నమైన ఈ దేశాలను ఎదుర్కోవడం వెనుక ఉన్న పరిణామాలు ఏంటనేది అంతుపట్టని ఆ దేశాలు నిఘావర్గాలతో సమాచారం సేకరించాయి. ఈ సందర్భంగా వెలుగు చూసిన వాస్తవాలు చూసి ఆ దేశాలన్నీ షాక్ కు గురయ్యాయంటే అతిశయోక్తి కాదు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ సద్దాం హుస్సేన్ ఉరిశిక్షకు గురి కావడానికి ముందు ఓ చిన్న తిరుగుబాటు సంస్థ. ఇరాక్ లో చమురు క్షేత్రాలను తన వశం చేసుకోవాలన్న కుయుక్తితో అణ్వాయుధాలు ఉన్నాయనే వంకతో సద్దాం హుస్సేన్ పై అమెరికా యుద్ధానికి దిగింది. దీంతో అమెరికాను అడ్డుకునేందుకు రష్యా, చైనా దేశాల నుంచి సద్దాం హుస్సేన్ భారీ ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేసి దిగుమతి చేసుకున్నాడు. దీంతో అమెరికా వ్యూహాత్మకంగా ఇరాక్ లోని ఉగ్రవాద సంస్థలు, తిరుగుబాటు గ్రూపులకు ఆయుధాలు అందజేసి సద్దాం హుస్సేన్ పైకి ఉసిగొల్పింది. మరోవైపు ఇరాక్ సేనలపై దాడులకు దిగింది. నాలుగు వైపుల నుంచి దాడులు ప్రారంభం కావడంతో సద్దాం సైన్యంపై అమెరికా సైన్యం పోరాటం సులువైపోయింది. ఇరాక్ ను వశం చేసుకుంది. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. మాజీ సైనికులు తిరగబడకుండా ఉండేందుకు నాటో దేశాలు ఇరాక్ కొత్త సైన్యానికి భారీ ఎత్తున ఆయుధాలు సరఫరా చేశాయి. ఈ క్రమంలో బలం పుంజుకున్న ఐఎస్ కొత్త సైన్యంపై దాడులకు దిగింది. ఒక్కో ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటూ 2014లో జూన్ లో ఇరాక్ లోని మోసూల్ పట్టణంలోకి ప్రవేశించింది. ఈ పట్టణం స్వాధీనం చేసుకునేందుకు ఇరాక్ సైన్యంపై ఐఎస్ విరుచుకుపడింది. ఈ పోరాటంలో ఐఎస్ ధాటికి తలవగ్గిన ఇరాక్ కొత్త సేనలు వేలాది ఏకే 47 రైఫిల్స్, టీ55 యుద్ధ ట్యాంకులు, అబ్రం ట్యాంకులు, ఎంవీలను వదిలి పారిపోయాయి. ఇవన్నీ ఐఎస్ చేతికి చిక్కాయి. దీంతో ఒక్కసారిగా ఐఎస్ఐఎస్ ఆయుధ సంపత్తి అమాతం పెరిగిపోయింది. ఈ క్రమంలో ఇరాక్ కొత్త సేనల వల్ల ఇబ్బందులు పడ్డ మాజీ సైనికులు (సద్దాం సైన్యం) ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చారు. వీరి శిక్షణలో రాటుదేలిన ఐఎస్ ఉగ్రవాదులు బలం పుంజుకున్నారు. ఎలాంటి దాడులనైనా తట్టుకునేందుకు వీలుగా బంకర్లు నిర్మించుకున్నారు. అండర్ గ్రౌండ్ టన్నెల్లు నిర్మించుకుని ఆయుధాలు, ఆహారం దాచుకున్నారు. దీంతో వారాలు, నెలల తరబడి శత్రువులతో పోరాడే శక్తిని సంతరించుకున్నారు. ఈ ముందు చూపే వారిని రక్షిస్తోంది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, జపాన్, చైనా దేశాలు ఏకమైనా ఐఎస్ఐఎస్ ను ఏమీ చేయలేక చేష్టలుడిగి ఇతర దేశాల సహాయ సహకారాలు అర్థించేలా చేస్తున్నాయి. తాజాగా రష్యా బయటపెట్టిన సాక్ష్యాలు కూడా ఐఎస్ ఆర్థికంగా పుంజుకోవడానికి కారణమని అర్థమవుతోంది. ఇరాక్, సిరియాల్లోని ఇంధన ఉత్పత్తి కర్మాగారాలను స్వాధీనం చేసుకున్న ఐఎస్, టర్కీ ద్వారా అమెరికాకు సరఫరా చేస్తోంది. తక్కువ ధరకు ఇంధనం లభిస్తుండడంతో అమెరికా తీవ్రవాదుల నుంచి కొనుగోలు చేస్తోంది. ఈ రహస్యం బయటపడకుండా ఉండేందుకు టర్కీ సేనలు తమ గగనతలంపై కేవలం 15 సెకన్లు మాత్రమే తిరిగిన రష్యా యుద్ధ విమానాన్ని కూల్చేయగా, దానికి అమెరికా మద్దతిచ్చింది. ఇన్ని లోసుగుల మధ్య ఐఎస్ ను ప్రపంచ దేశాలు కట్టడి చేస్తాయని ఆశించడం అత్యాశగానే గోచరిస్తోంది.