: 'ఫైర్ ఫాక్స్ ఓఎస్'ను ఉపసంహరించుకున్న మొజిల్లా
మొజిల్లా సంస్థ రెండేళ్ల కిందట తీసుకొచ్చిన తన 'మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఓఎస్' ను ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఆ సంస్థ ఓ ప్రకటన చేసింది. సాఫ్ట్ వేర్ డెవలపర్లకు మాత్రం ఓఎస్ అందుబాటులోనే ఉంటుందని, వారు దాన్ని తమ ప్రయోగాల కోసం ఉపయోగించుకోవచ్చని తెలిపింది. వినియోగదారుల నుంచి అంతగా స్పందన రానందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మొజిల్లా ప్రతినిధులు తెలిపారు. 2013లో వచ్చిన ఫైర్ ఫాక్స్ ఓఎస్ ను ఆధారంగా చేసుకుని స్పైస్ ఫైర్ వన్ ఎంఐ-ఎఫ్ ఎక్స్2, ఆల్కాటెల్ వన్ టచ్ ఫైర్ సి, ఆల్కాటెల్ ఆరెంజ్ కిల్ఫ్, ఇంటెక్స్ క్లౌడ్ ఎఫ్ ఎక్స్, ఫైర్ ఫాక్స్ యూ105, ఎల్ జీ ఎఫ్ ఎక్స్0 వంటి డివైస్ లు మార్కెట్ లోకి వచ్చాయి. దాంతో పాటు పలు ఎలక్ట్రానిక్ కంపెనీలు కూడా ఫైర్ ఫాక్స్ ఓఎస్ ఆధారిత 'హెచ్ డీ టీవీ' లను వినియోగదారుల కోసం ప్రవేశపెట్టాయి. అయితే ఈ ఉత్పత్తులకు అంతగా ఆదరణ లభించకపోవడం వల్లే ఓఎస్ ను మొజిల్లా ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.